పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎన్నికల సంఘం వద్దకు రాజకీయ పార్టీల నేతల క్యూ కడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య ఫిర్యాదుల పర్వం నడుస్తోంది. ఎన్నికల సంఘాన్ని కలుస్తున్న నేతలు.. ప్రత్యర్థి పార్టీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు వైసీపీపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కారణంగా ఇంటింటికీ పింఛన్లు ఆగిపోయాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కంప్లైంట్ చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ పింఛన్లు అందకపోవటానికి చంద్రబాబే కారణమని..ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛనుదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగం విద్వేషాలు రెచ్చగొట్టేలా దుష్ర్పచారం చేస్తోందని.. సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక టీడీపీ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. దీనిపై దర్యాప్తు జరపాలని ఏపీ సీఐడీ అధికారులను ఆదేశించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని సీఐడీని ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలోనూ ఈసీ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ నేతలు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఇటీవల వైసీపీ ఈసీని ఆశ్రయించింది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఫేక్ ప్రచారంపై దర్యాప్తు జరపాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈసీ ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద కేసు నమోదు చేశారు. చంద్రబాబును ఏ1గా , నారా లోకేష్‌ను ఏ2గా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది జరిగిన కాసేపటికే టీడీపీ సైతం ఈసీని ఆశ్రయించింది. ఇంటింటికీ పింఛన్ రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని ఈసీకి కంప్లైంట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుపై కూడా స్పందించిన ఈసీ.. దీనిని కూడా సీఐడీకి అప్పగించింది.