ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడి ఘటనపై సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి తొలిసారిగా స్పందించారు. విజయవాడలో మేమంతా సిద్ధం ర్యాలీలో సీఎం జగన్ మీద రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. కుట్లు కూడా పడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సీఎంపైనే దాడి జరగడం సంచలనం సృష్టించింది. దీనిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే వైఎస్ జగన్‌పై రాళ్లదాడి ఘటనకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి స్పందించారు. వైఎస్ జగన్‌పై దాడిని డ్రామా అని ప్రతిపక్షాలు విమర్శించడం చాలా బాధాకరం అని వైఎస్ భారతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు భారతి. డ్రామాలు ఆడాలనే అనుకుంటే దెబ్బ తగిలిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి హంగామా చేసేవారని చెప్పారు. అలా కాకుండా బస్సులోనే ట్రీట్మెంట్ తీసుకుని యాత్ర కొనసాగించేవారా అని ప్రశ్నించారు. ఇక గతంలో విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సమయంలోనూ ప్రతిపక్షాలు ఇలాగే అన్నాయని అన్నారు. అప్పుడు కూడా జగన్ హంగామా చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు విమర్శిస్స్తున్నట్లు.. సింపతీ ఓట్లతో గెలిచేందుకే వైఎస్ జగన్ తనపై దాడి చేయించుకున్నారనుకుంటే., వాళ్లు కూడా అలాగే దాడి చేయించుకుని సింపతీ ఓట్లతో గెలవమనండి.. ఎవరైనా వద్దన్నారా.. అంటూ భారతి సెటైర్లు వేశారు. అలాగే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ వైఎస్ జగన్‌కు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు,
వైఎస్ జగన్‌పై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి.. పోలీసులు సిట్ ఏర్పాటు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడ అజిత్ సింగ్ నగర్ సమీపంలోని వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి దాడి చేసినట్లు గుర్తించారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి.. రిమాండ్ తరలించారు. అయితే సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడి ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. గతంలో కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై దాడి ఘటన మీద ఆయన సతీమణి భారతి స్పందించారు. విపక్షాల విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.