ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ర్పచారం చేస్తున్నారంటూ సీఐడీ.. టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ1గా , ఏ2గా నారా లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. చంద్రబాబు, నారా లోకేష్‌ను ఏ1, ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మొత్తం పది మంది మీద కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కేసు నమోదు చేశారు.
మరోవైపు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారంటూ వైసీపీ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వైఎస్ జగన్ భూములు లాక్కుంటారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేయాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారా లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను, ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతోందని టీడీపీ గత కొంతకాలంగా విమర్శిస్తోంది. ఎన్నికల ప్రచారంలో దీనినే ప్రధానాస్త్రంగా చేసుకుని ఆ పార్టీ నేతలు ప్రచారం సాగిస్తున్నారు, అయితే తాను భూములు ఇచ్చే వాడినే కానీ.. లాక్కునే వాడిని కాదంటూ సీఎం వైఎస్ జగన్ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. అలాగే కోర్టు వివాదాలతో పనిలేకుండా ప్రజల భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించేందుకే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 తెచ్చినట్లు చెప్తున్నారు. వచ్చే రోజుల్లో ఇదో పెద్ద సంస్కరణగా మారుతుందని జగన్ చెప్తున్నారు,