కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో తిరుమలకు వచ్చి శ్రీవారి కటాక్షం కోసం తపిస్తుంటారు. ఇక శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి.. తరిస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా ఈ సేవలు అందిస్తోంది టీటీడీ. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా భక్తులకు ఉచితంగా ఈ సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో అన్నప్రసాదాలు అందించేందుకు భక్తులకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందించి ఒకరోజు శ్రీవారి భక్తులకు అన్నదానం చేసే సౌకర్యం కల్పిస్తోంది. శ్రీవారి భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది.
ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు 38 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 15 లక్షలు, రాత్రి భోజనం కోసం మరో 15 లక్షలు.. ఇలా ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం 38 లక్షలు చెల్లించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ తెలిపింది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అలాగే దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా పొందవచ్చని టీటీడీ తెలిపింది.
మరోవైపు ప్రస్తుతం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2లోని కంపార్టుమెంట్లు, క్యూలైన్లు, పాత అన్నప్రసాద భవనం, పీఎసీ-2లో ఉచితంగా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసం. విష్ణునివాసం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్ ఆస్పత్రి, ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరు అన్నప్రసాద భవనంలో ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోందని టీటీడీ తెలిపింది.