ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బదిలీ చేసింది. వెంటనే తమ కింది అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం వారిని ఆదేశించింది. ఈసీ ఆదేశాలో డీజీపీ ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇద్దరు డీఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై తెలుగు దేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. డీఎస్పీ వీర రాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు. అనంతపురం టీవీ టవర్ సమీపంలో వ్యక్తిగత కారణాలతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు గొవడకు దిగితే.. డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అరెస్ట్ చేశారని పార్టీ నేతలు ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని లేదా సస్పెండ్ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం డీఎస్పీపై బదిలీ వేటు వేసింది.