ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన మామను టార్గెట్ చేస్తూ గౌతమ్ విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తన రెండో అల్లుడు డాక్టర్ గుండబోలు గౌతమ్ మాటల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. గౌతమ్‌ను రెచ్చగొట్టి వీడియో రికార్డు చేయించారని.. ఎన్నికల సమయంలో ఫోకస్‌ను మార్చేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలిసికట్టుగా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
నాలుగేళ్లుగా తన రెండో కుమార్తె డాక్టర్ మనోజ్ఞ, అల్లుడు డాక్టర్ గౌతమ్ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు అంబటి రాంబాబు. రెండేళ్లుగా మనోజ్ఞతోపాటు ఆమె కుమార్తె, కుమారుడు తన సంరక్షణలోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.. వారికి అల్లుడి నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్నారు. గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించే వాడిని కాదని.. కానీ పొన్నూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో స్పందించాల్సి వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ మంత్రి రాంబాబుకు సొంత అల్లుడే ఓటు వేయొద్దని చెబుతున్నాని.. ఎవరి కుటుంబంలో వివాదాలు లేవు? అని ప్రశ్నించారు. అందరి కుటుంబాల్లోని వివాదాలు ఉన్నాయని.. గౌతమ్ తన కుమార్తెను బెదిరించి విడాకులు ఇవ్వాలని కోరారని, కుమార్తెతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం తాను ఫైట్ చేస్తున్నానన్నారు మంత్రి.
మంత్రి అంబటి రాంబాబుపై అల్లుడు గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న గౌతమ్.. వీడియోను విడుదల చేశారు. తన మామకు ఓటేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందన్నారు. రాంబాబుకి తాను అల్లుడిని కావడం దురదృష్టమని.. అతనికి వ్యక్తిత్వం లేదన్నారు. శవాలమీద పేలాలు ఏరుకునే రకమని.. రోజూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు.. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యక్తి తన జీవితంలో ఎదురు కాకూడదని కోరుకుంటానని.. అంత భయంకరమైన వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేయబోతున్న పదవి గౌరవప్రదమైందని.. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానన్నారు. ఎమ్మెల్యే అంటే.. మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలని.. వంద శాతం లేకపోయినా కనీసం వాటిలో ఒక శాతం కూడా లేని వ్యక్తి రాంబాబు అంటూ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్లన్నారు. ఎవరైతే నిస్సిగ్గుగా.. పెద్ద గొంతేసుకుని అరిచి అబద్ధాన్ని నిజం చేయొచ్చనే భ్రమలో బతుకుతారో అలాంటి వాళ్లకు ఓటేస్తున్నట్టు లెక్కన్నారు. ఎంత నీచమైన పనులు చేసినా సమాజంలో హుందాగా బతకవచ్చని అనుకునే వాళ్లను ప్రోత్సహించినట్టే అవుతుందన్నారు. అంబటి లాంటి వారిని ఎన్నుకుంటే రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుందన్నారు. ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు గౌతమ్. అయితే అల్లుడి వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటరిచ్చారు.