ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నేతలు షాకిచ్చారు. ఆమె తీరుపై రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఆదివారం వైఎస్సార్‌సీపీ అసంతృప్త లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కూడా హాజరయ్యారు.
మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు. పదేళ్లపాటు పార్టీ ఆభివృద్ధి కోసం కృషి చేసిన తనకు తగిన గుణపాఠం నేర్పారన్నారు. మంత్రి రోజా తన స్వార్థం కోసం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. నిండ్రలో తాను, విజయపురంలో లక్ష్మీపతిరాజు, వడమాలపేటలో మురళీధర్‌రెడ్డి, నగరిలో కేజేకుమార్, పుత్తూరులో అమ్ములు సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేశామన్నారు. ఆమె అక్రమ సంపాదన కోసం వ్యాపారాలకు అడ్డుపడతామని భావించి పార్టీ నుంచి దూరం చేసుకుంటూ వచ్చారన్నారు.
ఈ కారణాలతోనే తామంతా పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చక్రపాణిరెడ్డి. ఎన్నికల్లో ఆమె చెప్పే మాయ మాటలు విని ఎవరు మోసపోవద్దన్నారు.. మళ్లీ గెలిపించుకుంటే ఐదేళ్లు కనబడరన్నారు. తెలుగు దేశం పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గాలి భానుప్రకాష్. అందరం కలసికట్టుగా కృషి చేసి అత్యధిక మెజార్టీ వచ్చేలా పని చేయాలని సూచించారు. మంత్రి రోజాను నగరి నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని.. విజయపురం ప్రకృతి సంపదను దోచుకున్న ఆమెను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలన్నారు. అయితే ఈ సమావేశంలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మిగిలిన నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.