ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భీకరమైన ఎండ కొడుతోంది. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే భానుడి భగభగలకు అత్యవసరం అయితే తప్ప జనాలు బయటికి రావడం లేదు. వేడిగాలుల ప్రభావానికి తట్టుకోలేక జనం కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎండాకాలంలో కూలర్లు, ఏసీల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతుండగా.. భారత వాతావరణ శాఖ ఒక చల్లటి శుభవార్తను చెప్పింది. వేడిగాలులు తగ్గి.. మరికొన్ని రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. తూర్పు ప్రాంతంలో నేటి నుంచి వేడిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు కూడా త్వరలోనే హీట్‌వేవ్ తగ్గి చల్లబడుతుందని ఐఎండీ తెలిపింది. ఇక మే 10 వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈసారి వేసవి కాలం ప్రారంభం కాకముందు నుంచే ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత నెల రోజుల నుంచి అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది.
ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో గత కొన్ని దశాబ్దాలుగా ఇంతటి అధిక ఉష్ణోగ్రత నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశంలో తూర్పున ఉన్న గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చల్లటి వార్తను అందించింది. మేఘాలయలోని ఖాసీ-జైంతియా కొండ ప్రాంతంలో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతినడంతో స్థానికులు నిరాశ్రయులయ్యారు. 400 మందికి పైగా ప్రజలు గూడు లేక అవస్థలు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి.