మహిళా ఎంపీ, మంత్రిని అపహరించి, డ్రగ్స్ ఇచ్చి రాత్రంతా నరకం చూపించిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా క్విన్స్‌లాండ్ ఎంపీ, బాధిత మంత్రి బ్రిట్నీ లౌగా ,తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన నియోజకవర్గంలోని ఎప్పూన్‌లో ఏప్రిల్ 28న ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి తెలిపారు. మంత్రి అయిన నాకే ఇలా జరిగితే.. సామాన్యులకు ఎందుకు జరగదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య నివేదికలో తన శరీరంలో డ్రగ్స్ ఉన్నట్టు నిర్దారణ అయ్యిందని, కానీ నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు.
డ్రగ్స్ తనపై ప్రభావం చూపాయని, తనను సంప్రదించిన ఇతర మహిళలు కూడా డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని ఎంపీ చెప్పారు. మా నగరంలో డ్రగ్స్ లేదా లైంగిక వేధింపుల వంటి దారుణాలు జరగకుండా నిర్భయంగా తిరిగే పరిస్థితి రావాలని ఆమె వాపోయారు. క్వీన్స్‌లాండ్ పోలీస్ సర్వీసు విభాగం అధికారులు మాట్లాడుతూ.. యెప్పూన్‌లో లైంగిక వేధింపుల ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఆ ప్రాంతం నుంచి మరెవరూ ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.
ఈ ఘటనపై క్వీన్స్‌లాండ్ గృహణ నిర్మాణ మంత్రి మేఘన్ స్కాన్లాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితురాలు బ్రిట్నీ లౌగాపై జరిగిన దారుణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. ‘గృహ, కుటుంబ, లైంగిక హింసకు మహిళలు బాధితులు కావడం ఆమోదయోగ్యం కాదు. మా ప్రభుత్వం మహిళలను రక్షించడానికి, హింసను అరికట్టడానికి చేయగలిగినదంతా చేస్తూనే ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.