ట్రెండింగ్
Epaper    English    தமிழ்

42 ఎకరాల విల్లా.. ఉచితంగా ఇస్తామంటున్న ప్రభుత్వం.. రూపాయి కూడా కట్టక్కర్లేదు

international |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:22 PM

ప్రభుత్వాలు పేదలకు ఉచిత ఇల్లు కట్టిస్తుంది. కొన్ని చోట్ల ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏకంగా విల్లానే ఫ్రీగా ఇస్తామని ప్రకటిస్తోంది. అది కూడా 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ విల్లా. ఈ విల్లాను సొంతం చేసుకోవాలి అనుకునేవారు వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించండి అంటూ ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. ఈ 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ విల్లాను సొంతం చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదని ప్రకటించింది. అయినప్పటికీ ఎవరూ ఆ విల్లాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ విల్లా మన దేశంలో అయితే లేదు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ విల్లా ఉంది.


జర్మన్‌ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జోసెఫ్ గోబెల్స్‌కు చెందిన ఈ విల్లాను 1936 లో నిర్మించారు. నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా ఉన్న జోసెఫ్ గోబెల్స్‌.. న్యూస్ పేపర్లు, రేడియో, సినిమాల ద్వారా నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ఈ విల్లాను జోసెఫ్ గోబెల్స్.. అనేక అవసరాలకు వినియోగించారు. అయితే ఆ విల్లాలో ఎంతో మంది హీరోయిన్లతో సంబంధాలు కొనసాగించారని కూడా ఎన్నో వార్తా కథనాలు వెలువడ్డాయి. అవి ఎంత వరకు నిజం అనేది మాత్రం స్పష్టత లేదు.


అయితే ఈ విల్లాను ప్రస్తుతం జర్మనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమ పరిధిలోనే ఉంచుకుంది. ఇక 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా నాజీ పాలనతో ముడిపడిన ఉన్న ఆ విల్లాను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని జర్మనీ ప్రభుత్వం చూస్తోంది. ఈ విల్లాను ఎవరైనా సొంతం చేసుకోవాలని కోరుకుంటే.. ప్రభుత్వం వారికి దాన్ని గిఫ్ట్‌గా ఇస్తుందని జర్మనీ ఆర్థిక మంత్రి స్టెఫాన్‌ ఎవర్స్‌ వెల్లడించారు.


2000 సంవత్సరం నుంచి ఆ విల్లాలో ఎవరూ నివాసం ఉండకపోవడంతో అది రోజురోజుకూ దెబ్బతింటోంది. 24 ఏళ్లుగా అందులో ఎవరూ ఉండకపోవడంతో కూలిపోయే దశకు వచ్చింది. ఇక ఈ విల్లాను సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జర్మనీ ప్రభుత్వం దాన్ని కూల్చివేసే అవకాశాలున్నట్లు స్థానికంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇక రెండో ప్రపంచయుద్ధం ముగిసే సమయంలో జోసెఫ్ గోబెల్స్‌.. తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఆ విల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com