మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిల.. పాలిటిక్స్‌లోనూ తనదైన స్టైల్ ఫాలో అవుతున్నారు. ప్రత్యర్థుల మీద మాటలతూటాలు పేల్చడంలోనూ.. దూకుడైన రాజకీయాలు చేయడంలోనూ ఒకడుగు ముందుండే షర్మిల.. సెటైర్లు పేల్చడంలోనూ రాజన్న స్టైల్ ఫాలో అవుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో షర్మిల భిన్నమైన శైలి అనుసరిస్తు్న్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో వైఎస్ షర్మిల.. కేసీఆర్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పాదయాత్ర సమయంలో షర్మిల చేసిన విమర్శలు.. యాత్రపై దాడుల వరకూ వెళ్లాయి.
ఇక అప్పుడప్పుడూ కేసీఆర్‌కు గిఫ్టులు పంపుతూ రాజకీయ విమర్శలు చేసిన షర్మిల.. ఎన్నికల ముందు మాత్రం సూట్ కేసు గిఫ్టుగా పంపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానుండగా.. వైఎస్ షర్మిల, కేసీఆర్‌కు సూట్ కేసును గిఫ్టుగా పంపించారు. బైబై కేసీఆర్ అంటూ సూట్ కేసును గిప్ఠుగా పంపారు షర్మిల. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ఎండ్ కార్డు పడుతోందని..సర్దుకునే టైమ్ వచ్చిందంటూ సూట్ కేసును గిఫ్టుగా పంపారు. ఆ విధంగా కేసీఆర్ మీద. ఆయన ప్రభుత్వం పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అప్పట్లో కేసీఆర్‌కు ఎన్నికల ఫలితాల ముందు గిఫ్టును పంపిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు మళ్లీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోలింగ్‌కు ముందు బహుమతిని పంపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మీద సూటి విమర్శలు చేస్తున్న షర్మిల.. అందులో భాగంగానే సోదరుడు వైఎస్ జగన్‌కు అద్దాన్ని బహుమతిగా పంపారు. వైఎస్ జగన్ పదేపదే చంద్రబాబు గురించి కలవరిస్తున్నారని.. ఆయన మానసిక స్థితిపై తనకు ఆందోళన కలుగుతోందంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అద్దంలో చూసుకుంటే మీకు మీరు కనిపిస్తున్నారో.. లేదా చంద్రబాబు కనిపిస్తున్నారో చెక్ చేసుకోవాలంటూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అద్దాన్ని గిఫ్టుగా పంపారు. ఇక ఈ గిఫ్టు రాజకీయాన్ని ప్రధాని మోదీ వరకూ తీసుకెళ్లారు వైఎస్ షర్మిల.
ఏపీ ప్రజల గోడు వినడంటూ ప్రధాని మోదీకి రేడియోను గిఫ్టుగా పంపించారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మాట్లాడే ప్రధాని గారు.. ఈ సారి మా ఏపీ ప్రజల మన్‌కీ బాత్ వినండి అంటూ షర్మిల రేడియోను గిఫ్టుగా పంపించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీని మోసం చేశారని.. ఇప్పుడేమో మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి ఏపీలో కాలుపెట్టే అర్హత కూడా లేదన్న షర్మిల.. ఏపీ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రకంగా బహుమతులు ఇస్తూనే సెటైర్లు పేలుస్తూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు వైఎస్ షర్మిల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa