ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019లో అందుకే ఓడిపోయా, ఈసారి మాత్రం.. మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 06:16 PM

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ నియోజకవర్గ లేఖ రాశారు. 2019 ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి ఈ ఐదేళ్లలో జరిగిన అంశాలను ప్రస్తావించారు. ‘శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం . ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో తాను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యా.. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం తనను కట్టిపడేశాయన్నారు. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నట్లు’ తెలిపారు.


 ‘యువగళం పాదయాత్ర ప్రారంభించకముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశాను. ప్రతి గడప తొక్కాను, నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని.. యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాదిపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నా తన మనసంతా మంగళగిరిలోనే ఉండేది. కుటుంబసభ్యుల్లా ఇక్కడి ప్రజలు తరచూ తనను కలుస్తూ తనపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేను. వారందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయగలిగా.. జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులుపెట్టి 53రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతికమద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేను. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం తన బలం, బలగమైన మంగళగిరి ప్రజలే’ అన్నారు.


‘25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసింది ఏంటో ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలి. రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉన్నారు. మంగళగిరి ప్రజలు తన కుటుంబసభ్యులు అనుకొని సేవలందించాను. చిరు వ్యాపారులకు తోపుడుబళ్లు మొదలుకొని పెళ్లికానుకల వరకు, వీధుల్లో సిమెంటు బల్లల మొదలు రోడ్లనిర్మాణం, తాగునీటి ట్యాంకర్ల వరకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అరాచకమూకలు అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి పోరాడి మరీ మంగళగిరి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేశాను. మహిళాసాధికార‌త విషయంలో తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నుంచి స్పూర్తి పొంది స్త్రీశక్తి కేంద్రాల‌ను ఏర్పాటు చేశాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడమేగాక వేలాదిమంది కుట్టుమిషన్లు అందజేసి సొంతకాళ్లపై నిలబడేలా చేయగలిగాను’ అన్నారు.


‘ఒకప్పుడు దేశంలోనే పేరెన్నికగన్న మంగళగిరి చేనేతమగ్గాలు కనుమరుగవుతున్న సమయంలో అధునాతన మగ్గాలతో వీవర్స్ శాలను ఏర్పాటు చేశాను. టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని టెక్నాలజీ, మార్కెటింగ్ మద్దతునిచ్చాను. చేనేత సోదరుల జీవితాల్లో మార్పుతెచ్చి, వారి ఆదాయం పెంచేందుకు తన శాయశక్తులా కృషిచేశాను. స్వర్ణకారుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహించా.. చివరకు పేదింట్లో కుటుంబసభ్యులు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చి ఇంటికి పెద్దకొడుకులా నిలబడ్డాను. ఒక వ్యక్తిగానే ఇంత చేసిన తనను శాసనసభకు పంపితే ఏవిధంగా సేవచేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలి.. వ్యక్తిగతంగా ఎంతచేసినా.. మంగళగిరి రూపురేఖలు మార్చడానికి తాను చేయాల్సింది చాలా ఉంది’ అన్నారు.


‘రచ్చబండ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన నేను క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశాను. కొండప్రాంతాలు, రైల్వేస్థలాలు, దేవాదాయ, అటవీభూముల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న పేదలు పట్టాల్లేక అవస్థలు పడ్డారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇప్పటికీ వేసవికాలంలో గుక్కెడు నీటికోసం ఇబ్బందిపడే పరిస్థితులను కళ్ళారా చూశాను. డ్రైనేజి సౌకర్యంలేక మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో అపార్ట్ మెంట్ వాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. గ్రామాల్లోని రహదారులు నడుములోతు గోతులతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. శ్మశానవాటికల్లో స్థలం లేక చనిపోయిన వారికి గౌరవంగా అంతిమసంస్కారాలు సైతం నిర్వహించలేకపోతున్నామని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నపుడు ఎంతో ఆవేదన చెందా. అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు, పేదలకు 20 వేల ఇళ్లు, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నాను. మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే తన సంకల్పం. అందరం కలసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం.. ఈ ఎన్నికల్లో తనను ఇంటిబిడ్డలా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలి’ అని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa