పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై రాజ్‌భవన్ కాంట్రాక్ట్ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన గవర్నర్.. ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2 నాటి సీసీటీవీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. తాజాగా, ఈ వ్యవహారంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఆ ఫుటేజ్‌ను ఎడిట్ చేశారని ఆరోపించిన దీదీ.. తన వద్ద వీడియోల పెన్‌డ్రైవ్ ఉందని బాంబు పేల్చారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు.
‘ఎడిట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను గవర్నర్ విడుదల చేశారు. నేను మొత్తం వీడియోను చూశాను. అందులో దిగ్భ్రాంతకర దృశ్యాలు ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది. గవర్నర్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది.. దీదీ దౌర్జ్యనాలను సహించబోనని గవర్నర్ అంటున్నారు.. కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదు.. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవికి రాజీనామా చేయాలి.. ఇంతవరకు గవర్నర్ ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు వెల్లడించాలి... ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లను’ అని మమత శపథం చేశారు.
గవర్నర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రాజ్‌భవన్‌లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని ఈ నెల మొదటివారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం విషయమై తనను ఏప్రిల్ 24, మే 2న రెండుసార్లు పిలిపించిన గవర్నర్.. ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండిచిన ఆనందబోస్.. వేధింపులకు పాల్పడ్డారని చెబుతున్న తేదీల సీసీటీవీ ఫుటేజ్‌లను గవర్నర్ సాధారణ పౌరులకు చూపించారు. అయితే, దీనిపై అభ్యంతరం తెలిపిన బాధిత మహిళ.. తన ముఖాన్ని బ్లర్ చేయకుండా వీడియోను బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ‘చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి గవర్నర్ కొత్త నాటకానికి తెరతీశారు.. నా అనుమతి లేకుండా నా గుర్తింపు బయటపడేలా వీడియోను విడుదల చేశారు.. ఇది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే..’ అని ఆమె ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa