ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరు మారనున్న గేట్స్‌ ఫౌండేషన్‌.. పదవి నుంచి తప్పుకున్న మిలిండా

international |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 10:08 PM

బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కో-ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు బిల్‌గేట్స్ మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ సోమవారం ప్రకటించారు. మాజీ భర్త బిల్‌గేట్స్‌తో కలిసి ఈ ఫౌండేషన్‌ను నెలకొల్పి గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా దీనిని తీర్చిదిద్దారు. మూడేళ్ల కిందట బిల్‌గేట్స్, మిలిండా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అసమానతలను తొలగించడానికి ఫౌండేషన్‌ చేస్తున్న అసాధారణ కృషి తనకెంతో గర్వకారణమని ఆమె ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు.


2021లో బిల్‌గేట్స్‌తో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత సంస్థను గణనీయంగా విస్తరించిన సీఈవో, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలపై ఆమె ప్రశంసలు కురిపించారు. సేవా కార్యక్రమాల్లో తదుపరి అధ్యాయానికి వెళ్లేందుకు ఇదే తనకు సరైన సమయమని ఆమె తెలిపారు. గేట్స్ ఫౌండేషన్‌తో తన అనుబంధం జూన్ 7 ముగియనుందని వెల్లడించారు. అటు, మిలిండా సేవలకు బిల్‌గేట్స్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్‌ను ఆమె వదలివెళ్లడం విచారకరమే.. అయినా భవిష్యత్తులో సేవారంగంలో మెలిండా ఎంతో ప్రభావం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గేట్స్‌తో ఒప్పందం ప్రకారం మిలిండాకు 1250 కోట్ల డాలర్లు లభిస్తాయి.


‘బిల్‌తో నా ఒప్పందం ప్రకారం ఫౌండేషన్ నుంచి తప్పుకోవడం ద్వారా మహిళలు, కుటుంబాల తరపున నా సేవలకు అదనంగా 12.5 బిలియన్ డాలర్లు పొందుతాను’ అని పేర్కొన్నారు. బిల్‌గేట్స్ వారసత్వం, మిలిండా సహకారాన్ని గౌరవించేందుకు ‘ఫౌండేషన్ పేరు గేట్స్ ఫౌండేషన్‌గా మారుతుంది’ అని ఆ సంస్థ సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు. ఈ ఫౌండేషన్‌కు ఏకైక ఛైర్మన్‌గా బిల్ కొనసాగుతారు. ఫ్రెంచ్ గేట్స్ తన సేవలు, దాతృత్వం తదుపరి అధ్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని సుజ్మాన్ చెప్పారు. ‘అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచడంలో తన పాత్ర గురించి మెలిండా కొత్త ఆలోచనలతో ఉన్నారు.. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను తిరిగి పొందడం కష్టతరంగా మారింది. వాటిపై దృష్టి పెట్టడానికి ఈ తదుపరి అధ్యాయాన్ని ఉపయోగించనున్నారు’ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com