ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గరి నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్ అన్నీ.. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన చేసే పనులు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నరేంద్ర మోదీని ఎన్నుకున్న నలుగురు వ్యక్తులను కూడా ప్రతిపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిచింది. అయితే నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఒక సాధువు అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనే పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్.
ఈ క్రమంలోనే నరేంద్ర మోదీని నలుగురు వ్యక్తులు ప్రతిపాదించారు. అందులో ఒకరు ఆయన వెంట నామినేషన్ కార్యక్రమానికి కూడా వెళ్లారు. పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుశ్వాహ, సంజయ్ సోంకర్‌లు నరేంద్ర మోదీని ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ నలుగురు 3 వేర్వేరు కులాలకు చెందిన వారు కావడం. పండిట్ గణేశ్వర్ శాస్త్రి బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కాగా.. బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుశ్వాహ ఓబీసీ వర్గానికి చెందిన వారు. ఇక సంజయ్ సోంకర్ ఎస్సీ వర్గానికి చెందిన వారు. అయితే ఈ పేర్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చర్చించి ఖరారు చేశారు.
ఎవరీ పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్?
జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సమయంలో పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్.. పేరు వార్తల్లో నిలిచింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం పెట్టింది ఈ పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్. ఆయన పూర్వీకుల గ్రామం తమిళనాడుకు చెందినవారు తంజావూరులోని తిరువిసనల్లూర్. ఇక 66 ఏళ్ల పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్.. జ్యోతిష్య శాస్త్రం, భారతీయ వేదాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడిగా పేరు గాంచారు. పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ కుటుంబం ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సంస్కృతికి నిలయంగా మారింది.
పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ తాత రామ్‌చంద్ర శాస్త్రి.. కృష్ణ యజుర్వేద సంప్రదాయానికి చెందినవారు. రామేశ్వరంలోని రామసేతు వద్ద ఉన్న ఇసుకను తీసుకుని రామ్‌చంద్ర శాస్త్రి.. కాలినడకన 19 వ శతాబ్దంలోనే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారని.. ఆ ఇసుకతో ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో శివలింగాన్ని తయారు చేసి.. కాశీకి వచ్చినట్లు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ పేర్కొన్నారు. అప్పుడు కాశీలో ఉన్న పండితులు.. రామ్‌చంద్ర శాస్త్రిని అక్కడ స్థిరపడేందుకు అంగీకరించడానికి ముందు దాదాపు 35 రోజుల పాటు అతని జ్ఞానాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
ఇక పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ తండ్రి లక్ష్మణ్ శాస్త్రి.. 1921 లో కాశీ నరేష్ మహారాజ ప్రభు నారాయణ్ సింగ్‌తోపాటు దేశంలోని చాలా మంది దాతల సహకారంతో శ్రీ వల్లభరామ్ శాలిగ్రామ్ సంఘ్‌వేద్ విద్యాలయ అనే వైదిక సంస్థను ప్రారంభించారు. జ్యోతిష్య పండితులు అయిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్.. తండ్రి స్థాపించిన సంఘ్‌వేద్ విద్యాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయనే అయోధ్య రామాలయ శంకుస్థాపనకు, ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించారు.