పెద్ద దోర్నాల మండలంలోని రైతాంగం వేసవి సాగుకు సన్నద్ధమవుతోంది. వాతావరణం చల్లబడుతుండడంతో పలు చోట్ల రైతులు భూములను దుక్కులు చేసి పశువుల ఎరువులు వేసి సారవంతం చేస్తున్నారు. జూన్ మాసం ఆరంభంలో తొలకరి వార్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటనతో పాటు ఇటీవల కురిసిన మోస్తరు వానతో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కొద్దోగొప్పో నీరున్న బోరుబావుల కింద వేసవి సాగు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు సాధారణంగా తమ కున్న వ్యవసాయ భూముల్లో సగ భాగం పత్తి, మరో సగ భాగం మిరప సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వేసవి, ఖరీఫ్ సీజను మొదటి భాగం జూన్, జులైలో తక్కువ పెట్టుబడితో పత్తిసాగు చేసి ఆ పంటపై వచ్చే ఆదాయంతో ఖరీఫ్ రెండో భాగం ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో మిరప సాగు చేపడతారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రైతులు పత్తి విత్తేందుకు పొలాలను సిద్ధం చేశారు. వారం పది రోజుల్లో పత్తి విత్తేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలో వేసవిలో సుమారు 500 ఎకరాల్లో పత్తిసాగు చేయనున్నట్లు రైతులు తెలిపారు. పరిస్థితులను బట్టి ఖరీఫ్‌లో మరో 700ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది.