మహిళలు, యువతులపై లైంగిక దౌర్జ్యనాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ గురువారం తెల్లవారుజామున బెంగళూరులో దిగుతున్నారు. లైంగిక దాడుల వీడియోలు బయటకొచ్చిన తర్వాత ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు లూఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన బిజినెస్ క్లాస్ టిక్కెట్ బుక్ చేసినట్టు మీడియాకు వివరాలు లభించాయి. ప్రజ్వల్ జర్మనీకి వెళ్లినప్పుడే ఈ రిటర్న్ టిక్కెట్ కూడా బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందురోజే హసన ఎంపీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమానం ఎక్కారు.
ఈ ఆరోపణలపై మే 1న ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆయన.. ‘నేను బెంగళూరులో లేనందున విచారణకు హాజరుకాలేను.. నా తరఫున లాయర్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.. నిజం తర్వలోనే బయటపడుతుంది’ అని పోస్ట్ పెట్టారు. ఇక, ప్రజ్వల్ రెండుసార్లు టిక్కెట్ బుక్ చేసి రద్దుచేసుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని తాజాగా తేలిపోయింది. అయితే, ఇది హై-ప్రొఫైల్ కేసు కావడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ మాత్రం ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించింది. అతడికి బ్లూ కార్నర్ నోటీసులను జారీచేసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వ్యవహారం వెలుగులోకి రావడంతో కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేయగా.. పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ బహిష్కరించింది. ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై కూడా అత్యాచారం, బెదిరింపులు, కిడ్నాప్ వంటి కేసులు నమోదుకాగా.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, ఈ కేసులో అతడికి ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులను రాజకీయ కుట్రగా అభివర్ణించిన రేవణ్ణ.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదన్నారు. తండ్రికి బెయిల్ వచ్చినంత వరకూ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి తిరిగి రాడనే ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఆయన బుధవారం విమానం ఎక్కడం గమనార్హం.