ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏది ఇష్టమైతే అది వండిపెడతా.. మోదీకి బెంగాల్ సీఎం మమతా బంపరాఫర్!

national |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 09:41 PM

నవమి నవరాత్రుల సమయంలో బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చేపలు తింటోన్న వీడియోపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. దీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం విమర్శలు గుప్పించారు. తాజాగా, ఈ వివాదంపై స్పందించిన పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వంట చాలా బాగా చేస్తానని, ప్రధాని కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది.


సోమవారం కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. ‘నేను నా చిన్నతనం నుంచి వంట చేస్తున్నా.. చాలా రుచిగా వండుతానని నా చేతివంట తిన్నవాళ్లు అంటారు. ప్రధాని మోదీ కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నా చేతివంటను మోదీ అంగీకరిస్తారో, లేదో? ఆయనకు ఏది ఇష్టమైతే అదే వండిపెడతా. ఢోక్లా లాంటి శాకాహారంతో పాటు చేపల కూర లాంటి మాంసాహార వంటకాలు కూడా బాగా చెయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.


ఈసందర్భంగా తేజస్వీ యాదవ్‌పై మోదీ విమర్శల గురించి ప్రస్తావించిన దీదీ. ‘హిందువుల్లోనూ వివిధ వర్గాలకు చెందినవారివి ప్రత్యేకమైన ఆచారాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి.. పండగల సమయంలో మాంసాహారం వండుకుని తింటారు.. ఒకరి ఆహార అలవాట్లపై ఆంక్షలు విధించే అధికారం బీజేపీకి ఎక్కడ ఉంది? మన దేశ భిన్నత్వంపై బీజేపీ అధినాయకత్వానికి పెద్దగా అవగాహన లేనట్లు కన్పిస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శాకాహారి అయిన ప్రధానికి నాన్-వెజ్ వండిపెడతానని అనడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆమె ప్రధానిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది ప్రధానిని ట్రాప్ చేయడానికి మమతా బెనర్జీ పన్నిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒకవైపు ప్రధాని చేపలు లేదా మాంసాహారం తినరని ఆమెకు తెలుసు.. ప్రతి ఒక్కరూ ఇష్టపడే వాటిని తినడానికి అనుమతించాలని ఆమె విశ్వసిస్తేజజ. ఒకరి ఆహారపు అలవాట్ల గురించి మోదీ వ్యాఖ్యలను ఆమె ఎందుకు వక్రీకరించారు? ఆమె సనాతన హిందువులను అవమానిస్తున్నారు’ అని బెంగాల్ బీజేపీ నేత సనదేబ్ పాండే అన్నారు.


త్రిపుర మాజీ గవర్నర్ తథాగత రాయ్ స్పందిస్తూ.. ‘మోదీకి మమతా బెనర్జీ వంటచేసి పెడతాననడం మంచి ప్రతిపాదనే.. కానీ దీనికి ముందు, తన లెఫ్టినెంట్ ఫిర్హాద్ హకీమ్‌కు పంది మాంసం ఎందుకు వండి పెట్టకూడదు? ’ అని దుయ్యబట్టారు. మరోవైపు, సీపీఎం నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘బీజేపీ, తృణమూల్‌ మధ్య ఎలాంటి అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది’ అని సీపీఐ నేత వికాస్ భట్టాచార్య విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com