గుడివాడ లో ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ వార్డుల్లో గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ సర్దార్ బేగ్ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొడాలి నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, చిన్ని (కొడాలి నాని తమ్ముడు) ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణమండపానికి (కె.కన్వెన్షన్‌కు) పిలిపించి నిలదీయాలన్నారు. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయాలని సూచించారు. ఇవ్వని వారిపైకి మీ పెంపుడు కుక్కలను వదిలేయాలన్నారు. నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12(మైనార్టీ) వార్డుల్లోని వారున్నారని సర్దార్ బేగ్ అన్నారు.