పల్నాడు ప్రాంతానికి డీఎస్పీ రమణమూర్తి, సుబ్బరాజు నేతృత్వంలో వెళ్లిన బృందాలకు అడిషనల్ ఎస్పీ సౌమ్యలత సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. మాచర్ల, నరసరావుపేట ప్రాంతంలో జరిగిన హింసకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, కేస్ డైరీలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. దాడులు, ప్రతిదాడులు జరిగిన వీడియోలు వీక్షించి, తగిన సెక్షన్లు పోలీసులు నమోదు చేశారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. నరసరావుపేటలో జరిగిన అరాచకాలపై రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సౌమ్యలత పరిశీలించారు. రెంటచింతల పోలీసు స్టేషన్‌కు వచ్చిన సిట్ బృందం మండలంలో జరిగిన ఘటనలపై వివరాలను సేకరించింది. స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించింది. దాడుల్లో గాయపడిన వారి వివరాలను తీసుకుంది. ఈవీఎంల ధ్వంసం సంఘటనలకు సంబంఽధించిన వీడియో ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను కూడా పరిశీలించనున్నారు.