ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ కుటుంబ సభ్యులు బయలుదేరిన విమానం శనివారం ఉదయం 10.30 గంటలకు లండన్‌లోని లూటాన్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్‌ట్రాఫిక్ కారణంగా ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో 47 నిమిషాలు విమానం గాల్లో చక్కర్లు కొట్టి.. తర్వాత నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో దిగింది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు జగన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్‌కు అనుమతి రావడంలో మళ్లీ లండన్ బయల్దేరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లూటాన్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. జగన్ కుటుంబం లండన్‌కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 విమానాన్ని గన్నవరం విమానాశ్రయానికి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు.