ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలుత ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మరింత బలపడుతుందా? బలహీనపడుతుందా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. భూ ఉపరితలం నుంచి అల్పపీడనం/వాయుగుండం వైపు పొడిగాలు లు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తరువాత 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే క్రమంలో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈనెల 31కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, జూన్ ఒకటినే కేరళను రుతుపవనాలు తాకుతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. పసిఫిక్ మహా సముద్రంలో బలమైన ఎల్‌నినో బలహీనపడి ఈ నెలాఖరుకు తటస్థ పరిస్థితుల్లోకి మారుతుందని, ఆగస్టు నాటికి లానినాగా బలపడుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆ అంచనాల కంటే ఆలస్యం గా లానినా అభివృద్ధి చెందుతుందని స్కైమెట్ పేర్కొంది.