2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక విచిత్రం జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థికి ఓటు వేస్తానని తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేసినా.. చేయకున్నా అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన అలా ప్రకటించడానికి ఒక కారణం ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓటు వేయనున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇండియా కూటమిలో భాగంగా ఆప్ నేత సోమ్‌నాథ్ భారతీ బరిలో ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీ ఓటు ఆప్‌కు వెళ్లనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో నివసించే అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేయనున్న ప్రాంతం చాందినీ చౌక్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఈ చాందినీ చౌక్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేపీ అగర్వాల్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాహుల్ గాంధీ కోరారు.
ఇక రాహుల్ గాంధీతోపాటు ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఈ ఎన్నికల్లో తమ సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితికి లేకుండా పోయింది. పొత్తులో భాగంగా ఈ స్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు.. ఢిల్లీలో ప్రత్యర్థులు కావడంతో ఇండియా కూటమి ఏర్పాటైన కొత్తలో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నన బీజేపీని గద్దె దించాలంటే ఈ 2 పార్టీలు కలవక తప్పలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినపుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించి ఆప్‌కు మద్దతుగా నిలిచింది.
ఈ క్రమంలోనే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేస్తానని వెల్లడించారు. అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు ఎంత సఖ్యతగా ఉన్నాయో చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ఇండియా కూటమి గెలుపు కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో పాటు ఆప్ కార్యకర్తలు విభేదాలు లేకుండా పని చేసి పార్టీలకు విజయాలు కట్టబెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.