దేశ విభజన జరిగి భారత్, పాక్ ఒకేసారి వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఈ సంఘటన జరిగి 75 ఏళ్లు పూర్తికాగా.. అప్పటితో పోల్చితే భారత్ ఎన్నో రెట్లు మెరుగైంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలబడుతోంది. ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా, విదేశీ సంబంధాల పరంగా, ఎగుమతుల పరంగా ఎన్నో రెట్లు ముందుంది. ఇక భారత్‌తో పోల్చుకుంటే పాక్.. ఏ రంగంలోనూ కనీసం పోటీలో కూడా నిలబడే స్థితిలో లేదు. దీంతో ఎప్పుడూ భారత్‌పై ఆ దేశ నేతలు అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలను ప్రశంసిస్తూ వస్తున్నారు. తాజాగా భారత వ్యాపార రంగంపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా భారత్‌ను కొనియాడారు.
పాకిస్థాన్‌లో బిజినెస్‌మెన్‌లను.. ఇక్కడి ప్రభుత్వం దొంగలుగా చూస్తుంటే.. భారత్ మాత్రం అక్కడి వ్యాపారులకు పూర్తి మద్దతు ఇచ్చి వారిన ప్రోత్సహిస్తోందని మొహ్సిన్ నఖ్వీ తాజాగా పేర్కొన్నారు. అందుకే భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. పాక్ మాత్రం అక్కడే ఉండిపోయిందని సొంత దేశంపైనే విమర్శలు చేశారు. భారతదేశ ప్రగతికి ఇది కూడా ఒక కారణం అంటూ ఆయన మన దేశంపై ప్రశంసలు కురిపించారు. భారత్‌లో బిజినెస్‌మెన్‌లకు చాలా గౌరవం ఉంటుందని.. వారికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మద్దతుగా నిలవడం ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఒక కారణం అని స్పష్టం చేశారు.
అదే సమయంలో పాకిస్థాన్‌లో మాత్రం ఓ బిజినెస్‌మెన్ ఎదుగుతుంటే.. వారికి దొంగ అనే ముద్ర వేస్తారని మొహ్సిన్ నఖ్వీ మండిపడ్డారు. తాను ఒక బిజినెస్‌మెన్ అని.. తన వద్ద ఉన్న డబ్బును ఇష్టం వచ్చిన చోట పెట్టుబడి పెడతానని చెప్పారు. తన భార్యకు లండన్‌లో ఆస్తులు ఉన్నాయని.. ఆ దేశంలో ఆ ఆస్తులకు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదని.. కానీ అక్రమంగా సంపాదించే ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టవచ్చని మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలకు కూడా దుబాయ్‌లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో.. ప్రపంచ దేశాలకు చెందిన వేలాది మంది పెట్టుబడులు పెట్టినట్లు దుబాయ్ లీక్స్ ఇటీవల ఒక రిపోర్ట్‌ను వెలువరించింది. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన 17 వేల మంది కూడా ఉన్నారని తెలిపింది. పాక్ వాసుల ఆస్తుల విలువ దాదాపు రూ.90 వేల కోట్లకుపైనే ఉంటుందని తేలింది. అయితే పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ భార్యకు కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. దీన్ని ప్రస్తావిస్తూ నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 17 వేల మంది పాక్ వాసులు విదేశాల్లో ఆస్తులు ఉంటే విదేశాల నుంచి పాక్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయని.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.