ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అల్లర్లపై రెండురోజుల పాటు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు.. సోమవారం ఉదయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు అనేక కీలక అంశాలు పేర్కొన్నారు. అలాగే పలు సిఫార్సులు కూడా చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజు చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో రెండువర్గాలు రాళ్లదాడికి పాల్పడినట్లు సిట్ పేర్కొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని తెలిపింది.
ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సారావుపేట 10, మాచర్ల 8, గురజాల 4.. మొత్తంగా 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో రెండు కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని.. ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. మిగతావారిని కూడా అరెస్ట్ చేయాలని సూచించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో 728 మంది పాల్గొన్నారన్న ప్రత్యేక దర్యాప్తు బృందం..వీరిలో 396 మందిని గుర్తించినట్లు తెలిపింది.ఇప్పటి వరకూ 91 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ముందస్తు ప్రణాళికతోనే దాడులు జరిగాయని సిట్ పేర్కొంది. అయితే కేసుల దర్యాప్తు తీరులో లోపాలు ఉన్నాయన్న సిట్.. ఎఫ్ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపై సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే హింస జరుగుతుందని తెలిసీ.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్.. డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. సిట్ అధికారులు అల్లర్లకు సంబంధించి కేసులపై ఇకపైనా పర్యవేక్షణ కొనసాగించనున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేలోపు మరో నివేదికను అందజేయనున్నారు. అలాగే జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా సిఫార్సులు చేసినట్లు సమాచారం.