వివాహం జరిగిన తర్వాత గ్రామానికి ఊరేగింపుగా వస్తోన్న వధూవరులను ఆయుధాలతో వచ్చిన దుండగులు అడ్డగించారు. అనంతరం కారులో ఉన్న నవ వధువును బయటకు లాగి అపహరించారు. విస్తుగొలిపే ఈ ఘటన గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసి.. ఇప్పటివ రకూ నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశాయి. అయితే, వధువు ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె ఎక్కడుందో తెలుసుకోడానికి ఎనిమిది పోలీస్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... దహోది జిల్లా నవగామ్ సమీపంలోని భటివాడకు చెందిన రోహిత్ అమలియార్ (23) అనే యువకుడికి... సల్పాద ప్రాంతానికి చెందిన ఉష (22) అనే అమ్మాయితో మే 19న ఆదివారం వివాహం జరిగింది. ఆ రోజు రాత్రి వధూవరులు ఊరేగింపుగా గ్రామానికి బయలుదేరారు. బరాత్ నవగామ్‌కు చేరుకోగానే సాయుధులైన 15 మంది ద్విచక్రవాహనాలతో వచ్చి ఊరేగింపును అడ్డుకున్నారు. బెదిరించి వధూవరులు ఉన్న కారు డోర్లు బలవంతంగా తెరిచి.. ఆపై నవ వధువును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఐదుగురు అనుమానితుల పేర్లు చెప్పాడు. మహేశ్ భూరియా, నీలేశ్ భాభోర్, నరేశ్ భాభోర్, శైలేష్ మావీ, జితేంద్ర భాభోర్‌తో పాటు మరో 10 మంది కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు పేర్కొన్నాడు.
ఈ ఘటనలో మహేశ్ భూరియాను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు దహోద్ డీఎస్పీ జగదీశ్‌సింగ్ భండారీ తెలిపారు. నిందితులు.. నవ వధువు దూరపు బంధువులని, మహేశ్ కజిన్ ఒకరు ఉష కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. కిడ్నాప్ చేసిన వధువును నిందితుడు మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ సరిహద్దుకు సమీపంగా ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
వరుడు రోహిత్ అమలియార్.. గోధ్రాలోని ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది కిందట ఉషతో పెళ్లి నిశ్చయమైందని పోలీసులు తెలిపారు. నిందితులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకూ నవదంపతుల కారు వెనుక వస్తున్నవారిని, ఇతర వాహనాలను అడ్డుకున్నారు. పక్కా ప్లాన్‌తోనే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.