ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదని తమ పార్టీ ఎంపీ తీరుపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలకు దిగిన పార్టీ.. షోకాజ్ నోటీసులు జారీచేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జయంత్ సిన్హా గత కొన్ని రోజులుగా బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. ఐదో విడతలో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ స్థానానికి సోమవారం పోలింగ్ జరిగింది. అయితే, ఇక్కడ తన పార్టీ అభ్యర్ధికి యశ్వంత్ సిన్హా కుమారుడైన జయంత్ ఓటు వేయలేదు. దీంతో పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించి, వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
‘హజారీబాగ్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించినప్పటి నుంచి మీరు పార్టీ సంస్థాగత కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు.. కనీసం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా మీరు గుర్తించలేదు.. మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ఠకు నష్టం జరిగింది’ అని జయంత్ సిన్హాకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసుకు రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, ఈ నోటీసులపై సిన్హా ఇంకా స్పందించలేదు.
కాగా, ఈ ఏడాది మార్చి 2న ఎక్స్‌లో ట్వీట్ పెట్టిన జయంత్ సిన్హా.. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. దేశంతో పాటు ప్రపంచంలో వాతావరణ మార్పులపై తాను దృష్టిసారించాల్సి ఉందని అన్నారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే హజరీబాగ్ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానం నుంచి యశ్వంత్ సిన్హా, ఆ తర్వాత 2014, 2109లో ఆయన కుమారుడు జయంత్ సిన్హా ఎన్నికయ్యారు. ఇక, క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. తాను మళ్లీ క్రికెట్ ప్రపంచంలోని వెళ్తున్నట్టు తెలిపారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన తూర్పు ఢిల్లీలో హర్ష్ మల్హోత్రకు బీజేపీ సీటు కేటాయించింది.
బీజేపీ ఎన్నికల యంత్రాంగం సర్వే నిర్వహించి.. గౌతమ్ గంభీర్, జయంత్ సిన్హాలకు ఈసారి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో హజరీబాగ్ నుంచి జయంత్ సిన్హా.. కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ సాహుపై 4.7 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.