ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజమైన ఫోటోలు, డీప్‌ఫేక్ ఫోటోలు గుర్తించలేకపోతున్నారా.. ఈ టిప్స్ పాటించండి: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:03 PM

రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మంచి కోసం టెక్నాలజీని డెవలప్ చేస్తే.. కొంత మంది ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం డీప్‌ఫేక్‍‌ వాయిస్‌లు, డీప్‌ఫేక్‍‌ ఫోటోలు, డీప్‌ఫేక్‍‌ వీడియోలు.. తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు ఈ డీప్‌ఫేక్ బారిన పడి.. తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన డీప్‌ఫేక్‍‌ ఫోటోలను ఎలా గుర్తించాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని టిప్స్ చెప్పింది. అంతేకాకుండా ఎలా గుర్తించాలో ఓ వీడియో రూపంలో విడుదల చేసింది.


ఏఐ టెక్నాలజీతో సృష్టించిన డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు వ్యాప్తి చెందడం తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. అయితే ఇలాంటి డీప్‌ఫేక్ ఫోటోలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో - పీఐబీ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. అయితే వేరే టెక్నాలజీ ఏమీ ఉపయోగించకుండానే.. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి.. ఏవి నిజమైన ఫోటోలో, డీప్‌ఫేక్ ఫోటోలో గుర్తించవచ్చని వెల్లడించింది. అయితే డీప్‌ఫేక్ ఫోటాను ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఆ వీడియోలో పీఐబీ అన్ని అంశాలను క్షుణ్ణంగా వివరించింది.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన డీప్‌ఫేక్ ఫొటోలో ఉన్న వ్యక్తి.. నిజమైన వ్యక్తికి తేడా ఉంటుంది. అంతేకాకుండా చేతివేళ్లు, కాలి వేళ్లు నిజంగా ఉన్న వాటి కంటే వేరుగా కన్పిస్తాయని ఆ వీడియోలో పీఐబీ పేర్కొంది. ఇక మార్ఫింగ్ చేసే ఫొటోల్లో అందులో ఉన్న వ్యక్తి నీడలు కొంచెం తేడాగా ఉంటాయని వెల్లడించింది. ఇలా ఆ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏది నిజమైందో ఏది డీప్‌ఫేక్ ఫోటోనో ఈజీగా కనిపెట్టవచ్చని తెలిపింది. దీంతో పీఐబీ విడుదల చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


 ఇటీవల కొందరు సినిమా సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల డీప్‌ఫేక్‌ ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పెను దుమారానికి కారణం అయింది. ఈ డీప్‌ఫేక్‌లను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వానికి చాలా మంది విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ డీప్‌ఫేక్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. నకిలీ ఫోటోలు, వీడియోలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత డీప్‌ఫేక్‌పై చట్టం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com