మహిళలు, యువతలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులతో ప్రజ్వల్ దాగుడుమూతలు ఆడుతున్నారు. మూడుసార్లు రిటర్న్ టిక్కెట్ బుక్ చేసినట్టే చేసి మళ్లీ క్యాన్సిల్ చేసుకున్నాడు. గతవారం అతడు మ్యూనిచ్‌లో విమానం ఎక్కి.. బెంగళూరుకు చేరుకుంటాడని ప్రయాణానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో సిట్ అధికారులు కాపు కాశారు. కానీ, అప్పుడు కూడా మాజీ ప్రధాని మనవడు ఝలక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రజ్వల్ బాబాయి హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం పరువు ప్రమాదంలో ఉందని, పోలీసులకు లొంగిపోవాలని ఆయన కోరారు. తనపై, తాత హెచ్‌డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ప్రజ్వల్‌కు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. లైంగిక దౌర్జన్యాల వీడియోల కేసు కుటుంబాన్ని తల దించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తాను బేషరతుగా కర్ణాటక ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని మాజీ సీఎం అన్నారు.
అంతేకాదు, ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా అంటగట్టారని, దేవేగౌడ, తన పేరును లాగుతున్నారని కుమారస్వామి ఆక్రోశించారు. తీవ్ర మనస్థాపంతో తన తండ్రి దేవెగౌడ రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకుంటే.. తామంతా నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ చెప్పకుండా ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిపారు. ఒక వారం తర్వాత వెనక్కి వచ్చి విచారణకు హాజరవుతానని చెప్పాడని అన్నారు. అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో స్వదేశానికి వచ్చేందుకు భయపడి ఉండొచ్చని పేర్కొన్నారు.
సోదరుడు హెచ్‌డీ రేవణ్ణను కలిసేందుకు పద్మనాభనగర్‌కు వెళ్లాననే వార్తల్లో నిజం లేదన్నారు. తన తల్లిదండ్రుల క్షేమ సమాచారం తెలుసుకోడానికే వెళ్లానని మాజీ సీఎం స్పష్టం చేశారు. ‘చట్ట ప్రకారం పోలీసుల విచారణకు హాజరవ్వు.... దొంగా పోలీసు ఆట ఎన్ని రోజులు ఆడతావు? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని ప్రజ్వల్‌కు బాబాయి హితవు పలికారు.