కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి జరుగుతోన్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతలు ఉన్నారని చెప్పారు. కానీ, ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదుచేశారు.
ఇక, రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో పోలీసులు చేర్చలేదని తెలుస్తోంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు వ్యాపార రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాముల ఎండీఎంఏతోపాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైనవారి నుంచి రక్త నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపారు.
బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్త మాట్లాడుతూ.. జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని, 15 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా ఆరు గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తులు పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీ నిర్వహించినట్టు పేర్కొన్నారు.
‘సన్ సెట్-సన్ రైజ్ విక్టరీ’ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో వారి స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు చెప్పారు. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని అన్నారు. వీరితో పాటు టెక్కీలు, 25 మంది యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్ధిఖీ, రణధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు. పోలీసుల దాడి సమయంలో కొందరు డ్రగ్స్‌ను టాయ్‌లెట్‌లు, బాత్‌రూమ్‌లు ఇతర ప్రదేశాల్లో పడేసినట్లు గుర్తించామని కమిషనర్ చంద్రగుప్తా అన్నారు. కాగా, పార్టీలో స్వాధీనం చేసుకున్న ఓ కారుపై ఏపీకి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీపరిశ్రమలో పేరున్న ఓ సహాయ నటి రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరగడంతో ఆమె వివరణ ఇచ్చారు.