దక్షిణాది మార్కెట్లో పొగాకు జోరు కొనసాగుతోంది. మేలురకం బేళ్ల కు గరిష్ఠ ధరలు మంగళవారం మార్కెట్లో ఏకంగా కిలో రూ.322 పలికింది. ఒంగోలు-2 వేలంకేంద్రంలో ఈ ధర లభించగా ఇతరచోట్ల కూడా రూ.312 నుంచి రూ.320 వరకు ఉంది. వారం క్రితం కిలో రూ.300గా ఉండగా శనివారం రూ.311 పలికింది. మంగళవారం కిలోకు మరో రూ.11 పెరిగి ఏకంగా రూ.322 లభించింది. పొగాకు బోర్డు చరిత్రలో దక్షిణాది వేలం కేంద్రాలలో ఈ స్థాయి ధర లభించడం ఇదే ప్రథమం. మార్కెట్లోకి ఇంకా కూడా మేలురకం బేళ్లు పరిమితంగానే వస్తుండగా వాటి కోసం బయ్యర్లు పోటీపడుతున్నారు. తదనుగుణంగా డిమాండ్ లభించి గరిష్ఠ ధరలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం మార్కెట్లో మీడియం, లోగ్రేడ్‌లకు కూడా భారీ డిమాండ్ కనిపించింది. మీడియంగా భావించే ఎఫ్-3 రకం ధర ఇంచుమించు మేలురకంతో పోటీపడుతూ కిలో రూ.310పైనే పలికింది. అదే సమయంలో లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్, అలాగే చిలకపచ్చ రకం బేళ్లకు కిలో రూ.280పైగా ధరలు లభిస్తున్నాయి. ఇక లోగ్రేడ్‌లో తక్కువ రకం బేళ్లకు కూడా కిలో రూ.205నుంచి రూ.220 వరకు పలుకుతున్నాయి. పొగాకు మార్కెట్లో దిగ్గజ కంపెనీలుగా పేరున్న వారి కన్నా డీలర్లు, మధ్యస్థాయి కంపెనీల బయ్యర్లు అధికంగా ఈ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు దక్షిణాది వేలం కేంద్రాలలో సుమారు 52 మిలియన్ కిలోల కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.243 ధర లభించింది. ఈ స్థాయి గరిష్ఠ ధరలు అలాగే సగటు ధరలు గతంలో ఎన్నడూ లేకపోగా ప్రస్తుత మార్కెట్ పొకడ చూస్తే సగటు ధరలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది.