తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పర్యటన నుంచి వీరికి ఎందుకు అంత ఆత్రం..? భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరు కదా..? జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు లేవు కదా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని.. చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎక్కడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిందని, పాస్ పోర్టు సీజ్ చేసిందని నక్కా ఆనంద్ బాబు వివరించారు. ఆస్తుల కేసులో జగన్‌పై 13 సీబీఐ ఛార్జ్ షీట్స్ ఉన్నాయన్నారు. మీడియా ఉంది కదా అని చంద్రబాబుపై అడ్డగోలు రాతలు రాయించి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు అనే పదాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది జగన్ అని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు అందుకే 16 నెలలు జైలులో ఉన్నాడు.. ఈ విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు అని స్పష్టం చేశారు. వాస్తవానికి జగన్ పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో గల ఇంటికి వచ్చారు.. వారిని తీసుకుని లండన్ ఎందుకు వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో నమ్మించడం కుదరదు. ఆ రాతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడుతారని ధీమా వ్యక్తం చేశారు.