విశాఖ జిల్లాలో ఈ నెల 24 నుంచి మొదలయ్యే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి సూచించారు. జిల్లాలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలపై మంగళవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,530 మంది విద్యార్థులకు గానూ 1,118 మంది రెగ్యులర్, 412 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో వారంతా పరీక్షలు రాస్తారని, ఆయా పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖాధికారులు సమన్వయంతో పని చేసి రెగ్యులర్ పరీక్షల నిర్వహణకు మించి విజయవంతం చేయాలన్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి జరిగే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా డీఆర్‌వో సమీక్షించారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్‌కు 424 మంది, ఇంటర్‌కు 321 మంది పరీక్షలు రాస్తారన్నారు. వారందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.