ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టపగలు ఓ యువకుడు చోరీ చేశాడు. ఏదో భారీ చోరీ అనుకుంటే పొరపాటే.. వంటింట్లో ముఖ్యమైన వస్తువును తీసుకెళ్లాడు. ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.. ఆ విషయాన్ని మనోడు గమనించలేదు. మార్కాపురంభగత్ సింగ్ కాలనీలో ఓ లెక్చరర్ నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం సమయంలో లెక్చరర్ కుటుంబ సభ్యులు ఇంటి లోపల నిద్రిస్తున్నారు. అదే సమయంలో ఓ యువకుడు అటు వైపుగా వచ్చాడు.. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగాడు.. ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయో చూసుకున్నాడు.
కొద్దిసేపటికి మెల్లిగా గేటు తీసుకుని ఆ ఇంట్లో చొరబడ్డాడు. ఎవరైనా తనను చూస్తన్నారేమోనని అనుమానించాడు.. అటూ ఇటూ గమనించాడు. చుట్టూ ఎవరూ లేని సమయంలో ఇంటి బయట ఉంచిన సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. అక్కడ సిలిండర్‌ను భుజానికి ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయట సిలిండర్ కనిపించకపోవడంతో లెక్చరర్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఈ దొంగతనం వ్యవహారం బయటపడింది. ఈ సీసీ కెమెరా వీడియో వైరల్ అవుతోంది.