ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ కార్యకర్తల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరనుంది. అయితే ఛలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. తెలుగుదేశం ఛలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా పరామర్శ చేయనీయరా అంటూ మండిపడుతున్నారు.