ఎన్నికల సందర్బంగా తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు. అయన మాట్లాడుతూ.. పోలింగ్ నాడు చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో దాడులు జరిగాయన్నారు. పోలింగ్ రోజు నుంచి టీడీపీ చేస్తున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడిందని దాదాపు 60కి పైగా పోలింగ్ స్టేషన్ లలో రీపోలింగ్ జరపాలని కోరామన్నారు. వెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని ఏయే ఊర్లలో హింసాత్మక సంఘటనలు జరిగాయి, బూత్ లను టీడీపీ కబ్జా చేసి రిగ్గింగ్ చేసింది తగిన ఆధారాలను ముఖేష్ కుమార్ మీనాకు అందించడం జరిగిందన్నారు. వైయస్ఆర్ సీపీకి ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్ళు కొట్టి చంపాలని చూసినా ఆ విషయం తెలిసి తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీస్ సిబ్బందిని ఎస్ఐ, సీఐలను కొన్నిచోట్ల మార్చారని తెలియచేశారు. దాని వల్లనే హింస చెలరేగిందని ఆరోపించారు. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం వైయస్ జగన్ ని తిరిగి గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. మాచర్లలో తుమ్మురుకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందనేది ఆరోజు ఆయా పోలింగ్ బూత్ ల వద్ద వీడియో ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుందన్నారు. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు