ఎలాంటి కఠిన పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్పి కార్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్‌ను ఎస్పి పర్యవేక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరుగనున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సంసిధ్దంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేలా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరిగినా హింసాత్మక చర్యలకు పాల్పడినా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి? జన సమూహాలను నియంత్రించేందుకు ఎలాంటి హెచ్చరికలు జారి చేయాలి వినక పోతే సంబంధిత అధికారుల అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగిం చుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తమను తాము రక్షించుకుంటూ లాఠీఛార్జి, ఫైర్ డిపార్ట్ మెంట్ వాటర్ కెనాన్, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ తదితర వంటివి ప్రత్యేక పోలీసు బృందాలు డెమో ద్వారా ప్రదర్శించాయి. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, ఇన్స్ పెక్టర్లు రవీంద్ర, వెంకటేశ్వరరావు, ఆర్మ్‌డ్ రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.