బాపట్ల పట్టణంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీక్షీరభావన్నారాయణస్వామి 1431వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం బావయ్య వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి దివ్యరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి రథం బజారు నుంచి సూర్యలంకరోడ్డులోని శ్రీప్రపత్త్యాంజనేయస్వామి దేవాలయం వరకు రఽథాన్ని ఉత్సవంగా తీసుకెళ్ళి తిరిగి ఆలయానికి చేర్చారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి రథాన్ని లాగేందుకు ఆసక్తి చూపారు. భావనామస్మరణతో భావపురి పులకరించింది. బాపట్ల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా భక్తజనం విశేష సంఖ్యలో తరలివచ్చారు. భావదేవ పాహిమాం.. రాజ్యలక్ష్మీ రక్షమాం, శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి బహుపరాక్, గోవిందా.. గోవిందా అంటూ భక్తులు చేసిన నినాదాలతో రథంబజారు, సూర్యలంకరోడ్డు మార్మోగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఉంచి పండితులు శాస్ర్తోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.