ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఏపీసీసీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో సోదరుడు వైఎస్ జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత గత కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న వైఎస్ షర్మిల.. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా.. మళ్లీ వైఎస్ జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ఏలూరు జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల.. ఈ వార్తను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్‌పైనా, వైసీపీ పాలనపైనా ఓ రేంజులో విరుచుకుపడ్డారు.
"నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు.., మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు" అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు ఏలూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ పదో తరగతి బాలికపై.. సహ విద్యార్థే అత్యాచారానికి పాల్పడ్డాడు. తరగతి గదిలోనే ఆ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అతని స్నేహితులు ఆ దృశ్యాలు ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఫోన్‌లోని దృశ్యాలను అడ్డుపెట్టుకుని డబ్బుల కోసం బాలిక కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ విషయం పోలీస్ స్టేషన్ చేరగా.. నిందితుడితో పాటుగా , అతని స్నేహితులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వార్త పత్రికలో రాగా.. ఆ కథనాన్ని ట్వాగ్ చేస్తూ షర్మిల.. వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు.