ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఉక్కబోత వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా ,అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన చోట్ల అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్రవాయుగుండంగా మారింది. ఇది శనివారం సాయంత్రానికిు తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపాను కారణంగా ఆదివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేమాల్ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా లేదని.. ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
విజయవాడ, అనంతపురంలో భారీ వర్షం
మరోవైపు శనివారం ఉదయం విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు నీటితో నిండిపోయాయి. బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురంలో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. అటు అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.