ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. చికెన్, మటన్ లేదంటే ఫిష్.. సండే అంటే ఏదో ఒక ముక్క నోట్లో పడాల్సిందే. అందుకే ఉదయం తెల్లారగానే.. ఆ షాపుల ముందు క్యూ కడుతుంటారు. ఇక రేట్లు తగ్గాయంటే.. ఈ క్యూ మరింత పెరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ ఏకంగా రూ.300 వరకూ పలుకుతున్న పరిస్థితి. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలవైపు కన్నేస్తున్నారు. దీంతో అవి కూడా కాస్త రేట్లు పలుకుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం కేజీ చేపలను పదిరూపాయలకే విక్రయించారు.
అయ్ బాబోయ్.. అదేంటి కిలో చేపలు కేవలం పదిరూపాయలేనా.. అంటూ నోరెళ్లబెట్టకండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో కిలో చేపలను రూ. 10, 20 కే విక్రయించారు. దీంతో జనం కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయితే కేవలం పదిరూపాయలకే కిలో చేపలు అమ్మడం వెనుక కూడా వేరే కారణాలు ఉన్నాయి. ఆకివీడు పరిసరాల్లో ఉన్న చెరువుల్లో భారీగా చేపల పెంపకం సాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా చేపల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. మార్పుల కారణంగా ఆక్సిజన్ అందక చేపలు చనిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక.. వచ్చిందే చాలన్నట్లు రైతులు కిలో పదిరూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
ఆ రకంగా కిలో చేపలు 10 రూపాయలకే దొరుకుతుండటంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు క్యూ కడుతుంటే.. చేపల పెంపకం చేపట్టిన రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు కారణంగా చేపలు భారీగా చనిపోతూ ఉండటంతో చేసేదేమీ లేక ఇలా తక్కువ ధరకు అమ్ముతున్నామంటూ వాపోతున్నారు.