ఈవీఎం ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనలో ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తొలుత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సీఐ నారాయణస్వామి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు పిన్నెల్లి సోదరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలింగ్ సందర్భంగా టీడీపీ ఏజెంట్ మీద దాడి చేశారని ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదైంది. పాల్వాయి గేట్ గ్రామంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు మీద పిన్నెల్లి దాడి చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. అదే పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. జూన్ ఆరో తేదీ వరకూ పిన్నెల్లి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల వెళ్లకూడదని హైకోర్టు ఆంక్షలు విధించింది.
ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ పిన్నెల్లి ఇప్పటికీ బయటకు రాలేదు. అజ్ఞాతం వీడి ఇప్పటికీ బయట కనిపించింది లేదు. కౌంటింగ్ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో ఆరోజు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే ఒక హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పుడు మరో హత్యాయత్నం కేసు నమోదు కావటం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.