ఏపీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రోజు సమీపిస్తోంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తొలుత లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా అనుమతించాలని సూచించింది. ఆర్వో సీల్ లేదని తిరస్కరించవద్దని స్పష్టం చేసింది.
రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఫామ్ 13ఏ మీద రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకాన్ని బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో పోల్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చంటూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై మార్గదర్శకాలు జారీచేసింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించారు.
మరోవైపు ఈసీ మార్గదర్శకాలపై రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం ఇవ్వాలని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అవసరమని భావిస్తే దీనిపై ట్రైనింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదుకాగా.. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 25,283 ఓట్లతో నంద్యాల జిల్లా రెండో స్థానంలో.. 24, 918 ఓట్లతో కడప జిల్లా మూడోస్థానంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుగుణంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు.