ఒక ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి స్కూటీపై వెళుతున్న ఇద్దరి ప్రాణాలు బలిగొంది. అదే వేగంతో వేళ్లి ఒక టాటా ఏస్ వాహనాన్ని, రెండు కార్లను డ్యామేజీ చేసింది. విజయవాడ నగరంలోని రాజీవ్‌గాంధీ పార్కు వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ వద్ద నివాసముంటున్న షేక్ మునీర్ భాషా (59) తన భార్య షేక్ జమీనా (50)తో కలిసి స్కూటీపై భవానీపురం నుంచి కృష్ణలంక వైపునకు రాత్రి 7.30 గంటల సమయంలో బయల్దేరారు. రాజీవ్‌గాంధీ పార్కు వద్దకు వచ్చేసరికి వీరి వెనుక ట్రావెల్స్ బస్సు వస్తోంది. దాని బ్రేక్ ఫెయిలైంది. దీంతో బస్సు మునీర్ భాషా దంపతులు వెళ్తున్న బైకును ఢీకొంది. ఆ తరువాత టాటా ఏస్ వాహనం, మరో రెండు కార్లను కూడా బస్సు ఢీకొని సమీపంలోని లోబ్రిడ్జి వరకు దూసుకొచ్చి పండిట్ నెహ్రూ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద ఆగింది. ప్రమాదంలో మునీర్ భాషా, జమీనా అక్కడికక్కడే మృతిచెందారు. వన్ ట్రాఫిక్ సీఐ సాయి భాస్కర్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బస్సు గుంటూరు ఎస్‌సీఎన్ కాలనీలోనిసాయి మారుతీ గోపీచంద్ ట్రావెల్స్‌కు చెందినది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులో ఉన్న బస్సు యజమాని కొర్ర రమేశ్‌కు పోలీసులు సమాచారమిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మునీర్ భాషా నిడమానూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
![]() |
![]() |