తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. శ్రీవారి సేవకులుగా మంచి అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. సామాన్య భక్తులు సైతం సేవలు అందించేలా ఆన్‌లైన్‌లో అవకాశం కల్పిస్తోంది. నేడు శ్రీవారి సేవ ఆగస్టు కోటా విడుదల చేస్తారు. ఇవాళ తిరుమల , తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తుంది. అలాగే నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. స్వామివారికి సేవకులుగా రావాలనుకుంటున్న భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
శ్రీవారి సేవకులు తిరుమలతో పాటుగా తిరుపతిలో కూడా సేవలు అందిస్తారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియత్రించడం (క్యూ లైన్ల దగ్గర) నుంచి లడ్డూ కౌంటర్లు, హుండీ లెక్కింపులు (పరాకమణి), ఆలయ పరిసరాలు, అన్నదాన సత్రం ఇలా శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. శ్రీవారి సేవకుల వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలని టీటీడీ సూచిస్తోంది. అంతేకాదు వారు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. వీరు అందించే సేవలు స్వచ్ఛందమే.. శ్రీవారి సేవకులకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా ఉంది.
మే 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.
కాగా, రెండో రోజు మే 28వ తేదీ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల సందర్భంగా మే 27 నుండి 29వ తేదీ వరకు కల్యాణోత్సవం, మే 28న స్వర్ణపుష్పార్చన, మే 29న అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.