ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త. జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు రేపటి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. గత నెలలో మాదిరిగానే ఈసారి కూడా ఏపీలో పింఛన్ దారులకు రెండు విధాలుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. నగదు బదిలీ విధానం ద్వారా కొంతమందికి.. ఇక వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇంటివద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 65 లక్షల 30 వేల 808 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి పింఛన్ ఇచ్చేందుకు రూ.1,939.35 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
జూన్ నెలకు సంబంధించి డీబీటీ విధానం ద్వారా 47 లక్షల 74 వేల 733 మంది పింఛన్‌దారులకు పింఛన్ మొత్తాన్ని రేపు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న 17 లక్షల 56 వేల105 మందికి ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్ అందివ్వనున్నారు. జూన్ ఒకటి నుంచి ఐదో తేదీవరకూ సచివాలయ సిబ్బంది వీరికి ఇళ్లవద్దనే పింఛన్ మొత్తాన్ని అందిస్తారు. గత నెలలో కూడా ఇదే విధానంలో పింఛన్లు పంపిణీ చేయగా.. ఈసారి కూడా పింఛన్ దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పింఛన్లు పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దగ్గర నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయవద్దని సీఈసీ ఆదేశించింది. దీంతో ఏప్రిల్ నెల పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. అయితే ఎండవేడిమికి తాళలేక పలువురు వృద్ధులు చనిపోవటంతో.. మే నెలలో పింఛన్లను రెండు విధాలుగా అందజేశారు. కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో జమచేయగా.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులకు ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. జూన్ ఆరో తేదీవరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో .. ఈసారి కూడా అదే పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు.