2024 ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. పోలింగ్ అనంతరం ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిన మీడియా సంస్థలు ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తానికి ఏపీ పీఠం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ- సీ ఓటర్ సర్వే ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఏబీపీ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది.
టీడీపీ కూటమి 21 నుంచి 25 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఏబీపీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. అధికార వైఎస్సార్‌సీపీ 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 52.9 శాతం ఓట్లు దక్కుతాయని ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. గత ఎన్నికల్లో ఏపీలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి భారీగా దెబ్బతింటుందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీ ఓటు శాతం 41.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు గానూ వైసీపీ 25 చోట్ల ఒంటరిగా పోటీచేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగగా.. టీడీపీ 17 చోట్ల, బీజేపీ 6, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలిచాయి. అటు కాంగ్రెస్.. వామపక్షాలతో కలిసి బరిలోకి దిగింది. కాంగ్రెస్ 23 లోక్ సభ స్థానాల్లో, సీపీఎం, సీపీఐ చెరో ఎంపీ సీట్లో పోటీ చేశాయి. మొత్తంగా 25 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 454 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.