రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో పాటు వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్‌కోర్‌లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa