ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించి వెలువడిన ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ సొంతంగానే మెజారిటీ మార్కును సొంతం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి వేవ్ ధాటికి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించిన వైసీపీ ఈసారి జనసేన 21 సీట్ల కంటే తక్కువకే పరిమితమైంది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహారీ పోరు సాగింది. చివరకు టీడీపీ అభ్యర్థినే విజయం వరించింది. 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎం. ఎస్. రాజు.. సమీప వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప మీద విజయం సాధించారు.
మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి ఎం.ఎస్ రాజు బరిలోకి దిగారు. వైసీపీ నుంచి గతంలో ఉపాధి హామీ కూలీగా పనిచేసిన ఈర లక్కప్ప అనే సామాన్య కార్యకర్తను బరిలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో ఎం.ఎస్. రాజుకు 78347 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి 78322 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌కు 16969 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో మడకశిర నుంచి తిప్పేస్వామి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చిన వైఎస్ జగన్.. సామాన్య కార్యకర్త ఈర లక్కప్పను బరిలోకి దింపారు.
ఇక ఎన్నికల కౌంటింగ్ సమయంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మొదటి రౌండ్ నుంచి ఇరుపార్టీల మధ్య ఆధిక్యం దోబూచలాడింది. చివరకు టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్ రాజుకు 25 ఓట్ల ఆధిక్యం తగ్గింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా గణనీయమైన స్థాయిలో ఓట్లు దక్కించుకుంది, కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ సుమారుగా 16 వేల ఓట్లను సాధించారు. ఇదే వైసీపీ ఓటమికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.