ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. వైఎస్సార్‌సీపీకి దారుణమైన ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక పరిణామం జరిగింది.. వైఎస్సార్‌సీపీ నుంచి నామినేటెడ్ పదవిలో ఉన్న నేత రాజీనామా చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి తప్పుకున్నారు.. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఈవోను కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి గతేడాది ఆగస్టులో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.. వైఎస్సార్‌సీపీ ఓటమితో ఆయనే స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరోవైపు భూమన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
భూమన కరుణాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2023లో ఆయనకు వైఎస్ జగన్ టీటీడీ ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించారు. అలాగే 2024 ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తనకు బదులు తన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వైఎస్ జగన్‌ను కోరగా.. టికెట్ కేటాయించారు. అభినయ్ రెడ్డిపై జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 60వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. కొడుకు అభినయ్ రెడ్డి ఓడిన వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.